← R5 News · Latest news

Published · By R5 News · Health

నరాల బలహీనతకు పల్లెటూరి ఫుడ్స్‌!

నరాల బలహీనత తగ్గడానికి తినాల్సిన పల్లెటూరి ఫుడ్స్‌, అన్నీ మనకు సింపుల్‌గా దొరికేవే!

 

మన నరాల ఆరోగ్యానికి, శరీర బలానికి పల్లెటూళ్లలో తినే సాధారణ ఆహారాలు ఎంతో మంచివి. నేటి బిజీ జీవితంలో సరైన పోషకాలు అందక చాలామందిలో నీరసం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. ఖరీదైన మందులు కాకుండా, మన వంటింట్లో సులభంగా దొరికే సహజ విలేజ్‌ ఫుడ్స్‌ తింటే నరాలు బలంగా ఉంటాయి, శరీరానికి మంచి శక్తి కూడా లభిస్తుంది. మరి ఆ పల్లెటూరి ఆహారాలు ఏమిటో, వాటి ఉపయోగాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం...

మన పూర్వీకులు ఎంతో కష్టపడి పనిచేసినా వృద్ధాప్యం వచ్చేవరకు ఎటువంటి నరాల బలహీనత గానీ, కీళ్ల నొప్పులు గానీ లేకుండా ఉక్కులాంటి శరీరంతో ఆరోగ్యంగా జీవించేవారు. అందుకు ప్రధాన కారణం వారు తీసుకునే సహజసిద్ధమైన, పోషక విలువలు కలిగిన సాంప్రదాయ ఆహారమే. కానీ నేటి మోడ్రన్‌ ప్రపంచంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆహారం, ఆర్టిఫిషియల్‌ డ్రింక్స్‌కు అలవాటు పడి, శరీరానికి అత్యవసరమైన పోషకాలను కోల్పోతున్నాం. దీనితో చిన్న వయసులోనే చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నరాల లాగుడు, విపరీతమైన నీరసం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి.

ఖరీదైన విటమిన్ మాత్రలు, ప్రోటీన్ పౌడర్ల వెంట పరుగెత్తే బదులు, మన వంటింట్లోనే దొరికే సాధారణ పల్లెటూరి ఆహార పదార్థాలను మళ్లీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ సాంప్రదాయ వంటకాలు నరాల కణాలకు అవసరమైన బీ-విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం వంటి పోషకాలను సహజంగా అందించి, శరీరానికి తిరిగి పూర్వపు బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. మన నరాలను బలంగా మార్చే ఆ పల్లెటూరి వంటకాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..

రాగులను పోషకాల గని అని అంటారు. వీటిలో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, బీ-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని WAJHN అధ్యయనం పేర్కొంది. ఇవి నరాల కణాలకు పోషణ అందించి, నరాల సంకేతాలు వేగంగా ప్రసారం కావడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. నరాల నుంచి కండరాలకు సంకేతాలు సరిగ్గా అందడానికి సహాయపడుతుంది.

 


ఉదయం పూట రాగి జావ తాగితే.. రోజంతా శక్తి లభిస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రాగి సంగటి తినంటే.. శరీర బలం పెరుగుతుంది, కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. వేసవిలో చలువ చేయడానికి, చలికాలంలో శరీరానికి బలం ఇవ్వడానికి రాగి డైట్‌లో తీసుకుంటే ఎంతో మంచిది.

చిన్నగా కనిపించే నువ్వుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని IJRSR అధ్యయనం పేర్కొంది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్-ఈ లభిస్తాయి. ముఖ్యంగా మెగ్నీషియం నరాలు, కండరాల సాధారణ పనితీరుకు తోడ్పడుతుంది. నువ్వుల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలుగా తయారు చేసుకుని తినవచ్చు. బెల్లంతో కలిపి నువ్వుల లడ్డూ తింటే రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో వచ్చే కీళ్ల నొప్పులు, నరాలు లాగడం, అలసటను తగ్గించడానికి రోజూ ఒక నువ్వుల లడ్డూ తినడం మంచి అలవాటు.
​పల్లెటూళ్లలో సులభంగా దొరికే మునగాకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, ఐరన్‌, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, నరాలకు తగినంత ఆక్సిజన్ అందేలా చేస్తాయి. కందిపప్పు, పెసరపప్పుతో కలిపి మునగాకు పప్పు వండుకుంటే ప్రోటీన్, మినరల్స్‌ సమపాళ్లలో అందుతాయి. అలాగే మునగాకు కూర, వేపుడు కూడా వారంలో రెండు మూడు సార్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలోని నీరసం తగ్గి ఉత్సాహం కలుగుతుంది.\

 

 

వేరుశెనగ, బెల్లం కాంబినేషన్‌ శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే అద్భుతమైన విలేజ్‌ స్నాక్‌. పల్లీలలో ఉండే విటమిన్-బీ3 (నియాసిన్‌), మెగ్నీషియం, మంచి కొవ్వులు మెదడు, నరాల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, నరాల అలసటను దూరం చేస్తాయి. సేంద్రియ బెల్లంలో ఉండే ఐరన్‌, మినరల్స్‌ రక్తాన్ని శుద్ధి చేసి, శరీర బలాన్ని పెంచుతాయి. సాయంత్రం వేళ టీ, కాఫీకి బదులుగా వేరుశెనగ చిక్కీ, లడ్డూ తింటే ఆకలి తీరడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
బియ్యం , మైదాతో చేసిన ఆహారాలకు బదులుగా సజ్జ, జొన్న రొట్టెలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. ఎన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. సజ్జలు, జొన్నలలో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం నరాలను ప్రశాంతంగా ఉంచడానికి, కండరాల పట్టేయడం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. జొన్న రొట్టెలు సులభంగా జీర్ణమవుతాయి, బరువును అదుపులో ఉంచుతాయి. సజ్జ రొట్టెలు శరీరానికి మంచి శక్తిని ఇచ్చి, దీర్ఘకాలిక బలాన్ని అందిస్తాయి.

 


ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

Publisher: Vinta Broadcasting India Private Limited · Contact the newsroom