షుగర్, బీపీ రెండూ ఉంటే జాగ్రత్త!
షుగర్, బీపీ తరచుగా ఒకేసారి ఎందుకు వస్తాయి? ఈ రెండు సమస్యలు కలిసి గుండె, కిడ్నీలు, కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? షుగర్, బీపీ మందులు కలిపి ఒకేసారి వాడొచ్చా? వీటిని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
డయాబెటిస్ (Diabetes), అధిక రక్తపోటు (హై బీపీ) ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు. అయితే, షుగర్ ఉన్నవారికి బీపీ రావడం.. రక్తపోటు ఉన్నవారికి డయాబెటిస్ రావడం మనం తరచుగా చూస్తుంటాం. ఈ రెండూ ఒకేసారి రావడానికి ప్రధాన కారణం వీటి వెనుక ఉన్న ఉమ్మడి ప్రమాద కారకాలు. అధిక బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, వ్యాయామానికి దూరంగా ఉండటం, చెడు ఆహారపు అలవాట్లు ఈ రెండు వ్యాధులకు కారణం. ఒక వ్యక్తిలో 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ఏర్పడినప్పుడు, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
రోజులు గడిచేకొద్దీ ఈ హై బ్లడ్ షుగర్ రక్తనాళాల్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తనాళాలు బిరుసుగా మారి, వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా, అధిక షుగర్ కిడ్నీల్ని కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోతాయి. ఇది నేరుగా రక్తపోటు (BP) పెరగడానికి కారణమవుతుంది. అదేవిధంగా, హై బీపీ కూడా రక్తనాళాల్ని దెబ్బతీసి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలా ఒకదానికొకటి తోడై, రెండు సమస్యలు ఒక సైకిల్లా మారి శరీరాన్ని మరింత బలహీనపరుస్తాయి.
షుగర్, హై బీపీ రెండూ ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు వాటి ఉమ్మడి ప్రభావం రక్తనాళాలు దెబ్బతినే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగులకు గుండెపోటు, పక్షవాతం, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీలు క్రమంగా పాడైపోయే ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు సమస్యలు ఎక్కువ కాలం పాటు అదుపులో లేకపోయే ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ఛాన్సులు ఎక్కువ.\
ప్రధానంగా గుండె, కిడ్నీలు, మెదడు, కళ్లు ఎక్కువ ప్రమాదంలో ఉంటాయి. షుగర్, బీపీ రెండూ ఈ కీలక అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) రావచ్చు. అలాగే కంటిలోని రక్తనాళాలు దెబ్బతిని 'డయాబెటిక్ రెటినోపతి' ఏర్పడుతుంది. ఇది పూర్తిగా చూపు కోల్పోయేలా చేస్తుంది.
హై బీపీ చాలావరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరంలో పెరిగిపోతుంది. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అంటారు. దీనిని గుర్తించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే మార్గం.
ఇక డయాబెటిస్ విషయానికి వస్తే.. ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా వేయడం, విపరీతమైన అలసట, కంటి చూపు మసకబారడం, గాయాలు త్వరగా మానకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొంతమందిలో తీవ్రమైన సమస్యలు తలెత్తే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవచ్చు.
వైద్యులు సూచించిన విధంగా రక్తంలో షుగర్ లెవల్స్‌ని ప్రతిరోజూ పర్యవేక్షించుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునేవారు లేదా రక్తంలో షుగర్ స్థాయిల్ని అకస్మాత్తుగా తగ్గించే మందులు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లోనే బీపీని కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
ప్రతిరోజూ ఒకే సమయానికి బీపీ చెక్ చేసుకోవడం మంచిది. ఆ రీడింగ్స్‌ను ఒక డైరీలో రాసి పెట్టుకుని, డాక్టర్‌ను కలిసినప్పుడు చూపించాలి. అయితే, రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి నియంత్రణను బట్టి ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలనేది డాక్టర్ నిర్ణయిస్తారు.
అవును, డాక్టర్ సూచించిన ప్రకారం ఈ రెండు మందుల్ని కలిపి వేసుకోవడం పూర్తిగా సురక్షితమే. అంతేకాదు, బీపీ కోసం వాడే కొన్ని రకాల మెడిసిన్ షుగర్ రోగుల కిడ్నీలకు అదనపు రక్షణను కూడా ఇస్తాయి. అయితే, కొన్ని రకాల మందులు రక్తంలో షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపొచ్చు.
మరికొన్ని మందుల వల్ల తలతిరగడం, బీపీ మరీ తగ్గిపోవడం లేదా శరీరంలో పొటాషియం స్థాయిల్లో మార్పులు రావడం వంటివి జరగొచ్చు. అందుకే వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందుల్ని ఆపేయడం గానీ, డోసు మార్చడం గానీ అస్సలు చేయకూడదు.
ఇలాంటి వారు ఆఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు ఎక్కువగా ఉండే నమ్కీన్ వంటి చిరుతిళ్లను పూర్తిగా తగ్గించాలి. అలాగే పంచాదర కలిపిన డ్రింక్స్, కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులకు దూరంగా ఉండాలి. స్వీట్లు, మైదా, తెల్ల అన్నం, శ్యాచురేడేట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనె పదార్థాల్ని తినకూడదు. ఆహారంలో ఎక్కువ ఉప్పును, మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి.
హారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పరిమిత పరిమాణంలో పండ్లు, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, బాదం పప్పు, వాల్ నట్స్, అవిసె, గుమ్మడి గింజలు, చేపలు, గుడ్లు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తుల్ని చేర్చుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండి, ఉప్పు తక్కువగా ఉండే ఆహారపు అలవాట్లు ఈ రెండు సమస్యల్ని అదుపులో ఉంచడానికి ఎంతగానో సాయపడతాయి.
వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు మధ్యస్థ తీవ్రత గల వ్యాయామం చేయాలి. దీనితో పాటు కండరాల్ని స్ట్రాంగ్‌గా మార్చే వ్యాయామాలు కూడా చేయడం మంచిది. అయితే, వ్యాయామాన్ని నెమ్మదిగా ప్రారంభించాలి. ఎక్కువ సేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం మానుకోవాలి. కఠినమైన వ్యాయామాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.\