← R5 News · Latest news

Published · By R5 News · Politics

మాజీ వలంటీర్లకు గ్రామస్తుల పట్టం

అల్లూరి సీతారామరాజు జిల్లా: నాడు ప్రజల ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించారు. నేడు అదే ప్రజల మద్దతుతో గ్రామ పాలనకు సారథులయ్యారు. ఐదేళ్లపాటు వలంటీర్లుగా ప్రజలకు సేవలందించిన ఇద్దరు మహిళలకు గ్రామస్తులు ఎన్నికల్లో పట్టం కట్టారు. ప్రజాసేవలో తమదైన ముద్ర వేసిన వారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన మాజీ వలంటీర్లకు సర్పంచ్, ఉప సర్పంచ్‌ పదవులు దక్కడం విశేషం. సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లల కల్యాణి తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ మద్దతుదారు, మాజీ సర్పంచ్‌ పిల్లల రావాలమ్మపై 78 ఓట్ల మెజార్టతో విజయం సాధించారు. ఎనిమిది వార్డులున్న ఈ పంచాయతీలో ఏడు వార్డులను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఉప సర్పంచ్‌ పదవి కూడా ఆ పార్టీ మద్దతుదారు అయిన పిల్లల కృష్ణకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

 

ప్రజాసేవకు దక్కిన గుర్తింపు 
గత ఐదేళ్లపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లుగా పనిచేసిన పిల్లల కల్యాణి, పిల్లల కృష్ణకుమారి గ్రామంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలను ఇంటింటికీ అందించడంలో భాగస్వాములయ్యారు. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేసిన వలంటీర్లను కూటమి ప్రభుత్వం వంచించి.. గౌరవ వేతనాలు రూ.10 వేలు ఇస్తామని నమ్మించి.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టింది. అయితే వైఎస్సార్‌సీపీ హయంలో చేసిన సేవలకు గాను ఆ పల్లెవాసులు వీరికి గ్రామ పగ్గాలు అప్పగించారు.

Publisher: Vinta Broadcasting India Private Limited · Contact the newsroom