← R5 News · Latest news

Published · By R5 News · Health

రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా? ఈ 3 తెల్లటి పదార్థాలతో బీపీ, షుగర్ ముప్పు!

High BP and Diabetes Risk : రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా..? ఈ 3 తెల్లటి పదార్థాలతోనే బీపీ, షుగర్ ముప్పు..! 
రుచిగా ఉందని తింటే తంటాలు తప్పవట.. అవును..మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవాలన్నా, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నా పండ్లు, కూరగాయలు, నట్స్, గింజల వంటి పోషకాహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకోవడంతో పాటు, వేటిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

 

మనం నిత్యం వంటల్లో, ఆహారంలో వాడే ఉప్పు, చక్కెర, మైదా పదార్థాలు వంటి మూడు తెల్లటి పదార్థాలను పరిమితికి మించి తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వీటి అతి వినియోగం వల్ల బీపీ, డయాబెటిస్, స్థూలకాయం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది.
ఈ మూడింటితో కలిగే నష్టాలివే..

 

ఉప్పు లేనిదే ఏ వంటకానికీ రుచి రాదు. కానీ, ఆహారంలో ఉప్పు మోతాదు పెరిగితే అందులోని సోడియం శరీరంలో నీటి నిల్వలను, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు (High bp) సమస్య వస్తుంది. ఇది గుండెపై అదనపు భారాన్ని మోపి హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఉప్పు ఎక్కువైతే మూత్రపిండాల (kidney function) పనితీరు దెబ్బతిని, మూత్రంలో ప్రోటీన్లు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది.

 

తీపి పదార్థాలంటే ఇష్టపడని వారుండరు. రోజూ తాగే టీ, కాఫీలు మొదలుకొని స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్‌ల ద్వారా మనకు తెలియకుండానే శరీరంలోకి అధిక మొత్తంలో చక్కెర చేరుతోంది. దీనివల్ల కేలరీలు పెరిగి బరువు పెరగడం, స్థూలకాయం (Obesity) వంటి సమస్యలు వస్తాయి. టైప్-2 డయాబెటిస్ రావడానికి ఊబకాయం ప్రధాన కారణం. కాబట్టి చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

 

వైట్ బ్రెడ్, మైదాతో షుగర్, జీర్ణ సమస్యలు..  

 


గోధుమ గింజల పైపొరను తొలగించి తయారుచేసే మైదాతో వైట్ బ్రెడ్ రూపొందిస్తారు. ఈ ప్రక్రియలో అందులోని పోషకాలు, పీచు పదార్థం (Fiber) పూర్తిగా నశిస్తాయి. ఇలాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఉండే బ్రెడ్‌ను తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. దీనికి తోడు ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు కూడా వేధిస్తాయి. కాబట్టి, రుచి కోసం ఈ మూడు పదార్థాలను అతిగా తీసుకోకుండా.. వాటి స్థానంలో తృణధాన్యాలు, బ్రౌన్ బ్రెడ్, సహజ సిద్ధమైన తీపి పదార్థాలను మితంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Publisher: Vinta Broadcasting India Private Limited · Contact the newsroom